|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 04:25 PM
హిందీ చిత్రసీమలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు నటిగా తనదైన ముద్ర వేసిన కామినీ కౌశల్ (98) కన్నుమూశారు. 1946 నుండి 1963 వరకూ కథానాయికగా రాణించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగారు. చివరగా కామినీ కౌశల్... షాహీద్ కపూర్ 'కబీర్ సింగ్' లో నటించారు. తెలుగు 'అర్జున్ రెడ్డి'లో కాంచన పోషించిన హీరో నానమ్మ పాత్రను హిందీలో ఆమె చేశారు. ఆ తర్వాత ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. దీనికి ముందు ఆమె 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్'లోనూ నటించారు.1927 ఫిబ్రవరి 24న కామినీ కౌశల్ లాహోర్ ఓ ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు ఉమ. తొలిసారి ఆమె 1946లో 'నీచ నగర్' సినిమాలో నటించింది. చేతన్ ఆనంద్ తెరకెక్కించిన ఆ సినిమాలో ఆయన భార్య ఉమ కూడా నటించారు. అందువల్ల తన పేరును కామినీగా మార్చుకోవాల్సి వచ్చిందని ఆమె అప్పట్లో తెలిపారు. 'దో భాయ్, షాహీద్, నదియా కే పార్, జిద్దీ, షబ్నం, పారాస్, నమూనా, అర్జూ, జంజర్, ఆబ్రూ, బడే సర్కార్, జైలర్, నైట్ క్లబ్, గోదాన్' తదితర చిత్రాలు నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.హీరోయిన్ పాత్రలకు స్వస్తి పలికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కామినీ కౌశల్ 'దో రాస్తే', అన్హోనీ, ప్రేమ్ నగర్, మహా చోర్' వంటి చిత్రాలలో నటించారు. కెరీర్ ప్రారంభం నుండి కామినీ కౌశల్ అనేక అవార్డులను అందుకున్నారు. సంచలన పాత్రలను పోషించడం కంటే నటిగా తనకు మంచి గుర్తింపు వచ్చే పాత్రలకే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. ఆమె మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Latest News