|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:33 PM
మలయాళం నుంచి థ్రిల్లర్ నేపథ్యంలోని కథలు ఓటీటీ తెరపైకి ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈ సారి మలయాళం నుంచి బ్లాక్ కామెడీ డ్రామా జోనర్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే 'అవిహితం'. అక్టోబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీ నుంచి మలయాళంతో పాటు ఇతర భాషల్లోను 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 'సెన్నా హెగ్డే' దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ప్రకాశ్ ఎప్పటిలాగే ఓ రాత్రివేళ తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటాడు. అక్కడి నుంచి అతను తిరిగి వస్తుండగా, పొదలచాటున ఏదో అలికిడి అవుతుంది. అతను రహస్యంగా ఆ వైపుకు అడుగులు వేస్తాడు. ఆ చీకట్లో వినోద్ .. ఓ యువతి కలుసుకోవడం చూస్తాడు.. ఆ యువతి ఎవరనేది అతనికి కనిపించదు. కానీ ఆ పక్కనే 'నిర్మల' ఇల్లు ఉండటం వలన, ఆమెనే అయ్యుంటుందని అనుకుంటాడు. మరునాడు ఉదయం ఈ విషయాన్ని తన స్నేహితుడైన 'వేణు'కి చెబుతాడు.ప్రకాశ్ మాటలను వేణు నమ్మలేకపోతాడు. అతనితో కలిసి ఆ రాత్రి ఆ ప్రదేశానికి వెళతాడు. ప్రకాశ్ చెప్పినట్టుగానే అక్కడ వినోద్ ఒక యువతిని చాటుగా కలవడం .. సరసాలాడటం వేణు కూడా చూస్తాడు. ఆ యువతి నిర్మలనే అయ్యుంటుందని అతను కూడా భావిస్తాడు. నిర్మల భర్త ముకుందన్ .. మరిది మురళి .. మామ మాధవన్ పక్క ఊరుకి పనిపై వెళతారు. తన అత్తగారు .. పాప 'మీనూ'తో కలిసి నిర్మల ఉంటుంది. ఆమెను గురించి మురళికి కాల్ చేసి చెబుతాడు వేణు. తన అన్నయ్య ముకుందన్ మంచితనాన్ని అమాయకత్వం క్రింద భావించి అతనిని నిర్మల మోసం చేస్తోందని మురళి భావిస్తాడు. తమ కుటుంబంతో ఉన్న పాత 'పగ' కారణంగా వినోద్ ఇలా చేస్తున్నాడని అనుకుంటాడు. ఆ కోపంతో అతను ఏం చేస్తాడు? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? వినోద్ - నిర్మల విషయంలో వారి అనుమానం నిజమేనా? అనేది మిగతా కథ.
Latest News