by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:21 PM
భారత వినియోగదారుల సంఘాల సమాఖ్య కన్జ్యూమర్ కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ ) ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి వెల్లడించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో సీసీఏ ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ స్వగృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ సదస్సు వివరాలను వెల్లడించారు. సీసీఐ రాష్ట్ర అధ్యక్షులు మొగిలిచర్ల సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూగురుపల్లి శ్రావణ్ కుమార్ తో కలిసి చక్రపాణి జాతీయ సదస్సు కార్యక్రమం లక్ష్యాలను నిర్దేశించారు.
తెలంగాణా రాష్ట్రంలో అక్టోబర్ 14 నుండి ప్రారంభమైన 'ఈట్ రైట్ ఫుడ్' అనే అంశము పై మూడు నెలల పాటు నిర్వహిస్తున్న సర్వే, చైతన్యం కార్యక్రమం లో భాగంగా ఈ నెల 18, 19 లలో నిజామాబాద్ జిల్లా కేంద్రం లో రెండు రోజుల వినియోగదారుల జాతీయ సదస్సు జరుగుతున్నదన్నారు. మొదటి రోజు 18 తేది కన్జ్యూమర్ కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వినియోగదారుల ప్రతినిధుల జాతీయ కమిటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగనున్నదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 53 మంది జాతీయ కమిటీ ప్రతినిధులు ఈ సదస్సులో హాజరవుతున్నారన్నారు. చీఫ్ పాట్రన్ డా. అనంత శర్మ, డా. అరుణ్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు ప్రీతి పాండ్య, కార్య నిర్వాహక అధ్యక్షుడు యం. సెల్వరాజు ల అధ్వర్యంలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ పై పలు తీర్మానాలు చేయనున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. ఆహార కల్తీ లేని ప్రభుత్వ విధానాలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల భాద్యతలు అనే అంశము పై తేది 19న జరిగే జాతీయ సదస్సులో సూక్ష్మ పోషకాలను అదనంగా కలిపే ఫోర్టిఫైడ్ బియ్యం, వంట నూనెలు, వనస్పతి, పాలు, పాలపొడి నాణ్యతలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజి, ఆహార కల్తీ నిరోధక శాఖ, ఐసీడీఎస్,ఆగ్ మార్క్ , ఔషద నియంత్రణ శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ల ముఖ్య పాత్ర లపై సదస్సు జరుగనున్నదని సిసిఐ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి చర్ల సుదర్శన్ తెలిపారు.ఇట్టి జాతీయ స్థాయి సదస్సులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, వినియోగదారుల ప్రతినిధులు, విజిలెన్స్ మానికరం కమిటీ ప్రతినిధులు పాల్గొనాలని సి సి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ కోరారు . అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అగ్మార్క్ , హాల్ మార్క్ తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనాలనుకొనే ప్రతినిధులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.