|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:21 PM
అమెజాన్ ప్రైమ్ లో బ్రిటీష్ హారర్ మూవీ 'బాంబి: ది రెకనింగ్' ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి సైతం ఈ సినిమా చెమటలు పట్టిస్తోంది. డాన్ అలెన్ దర్శత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. 1923లో రాయబడిన 'బాంబి ఎ లైఫ్ ఇన్ ది వుడ్స్' అనే నవల ఆధారంగా నిర్మితమైన ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను ఈ సినిమా అందుబాటులో ఉంది.
కథ: జానా ఆమె కొడుకు బెంజి ఒక రాత్రివేళ ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతకాలంగా తమకి దూరంగా ఉంటున్న భర్త సైమన్ దగ్గరికి కొడుకును తీసుకుని ఆమె వెళుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో వాళ్ల కారును ఒక 'దుప్పి' వెంటాడుతుంది. కారు డ్రైవర్ ను ఆ దుప్పి చంపేస్తుంది. ఒక దుప్పి అంత క్రూరంగా అరవడం .. ప్రవర్తించడం వాళ్లు చూడటం అదే మొదటిసారి. అతి కష్టం మీద ఆ తల్లీ కొడుకులు తప్పించుకుని, సైమన్ తల్లి మేరీ ఇంటికి చేరుకుంటారు. సైమన్ తల్లి మేరీకి అడవిలో తిరుగుతున్న ఆ భయంకరమైన దుప్పిని గురించి తెలుసు. అందువలన ఆమె ఆ ఇంట్లో ఎంతో భయంతో బ్రతుకుతూ ఉంటుంది. రాక్షస మృగంలా మారిన ఆ దుప్పి ఆ ఇంటిపై ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో ఆమె కాలం గడుపుతూ ఉంటుంది. ఆమె ఆ దుప్పి బొమ్మలు గీస్తూ .. ఇంట్లోవారిని హెచ్చరిస్తూ ఉంటుంది. ఒక రాత్రి వేళ ఆ దుప్పి వాళ్ల ఇంటిపై దాడి చేస్తుంది.ఆ దుప్పి బారి నుంచి తప్పించుకుని ఆ ఇంట్లో నుంచి వాళ్లు బయటపడతారు. సాధ్యమైనంత త్వరలో ఆ అడవిలో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వ్యానులో బయల్దేరతారు. అయితే ఆ దుప్పి వదలకుండా వాళ్ల వెంటపడుతుంది. ఆ దుప్పి ఎందుకు అంత క్రూరంగా మారిపోయింది? మనుషులను ఎందుకు అంతలా వెంటాడుతోంది? దాని బారి నుంచి 'జానా' కుటుంబ సభ్యులు బ్రతికి బయటపడతారా? అనేది మిగతా కథ.
Latest News