|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 06:54 PM
ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి సహ నిర్మాతగా వ్యవహరించిన 'కాంత' చిత్రం విడుదలకు ముందే న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. తమిళ చిత్ర పరిశ్రమ తొలి సూపర్‌స్టార్‌గా ఖ్యాతి పొందిన ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రంలో తమ తాతగారిని అవమానకరంగా, వాస్తవాలకు విరుద్ధంగా చూపించారని ఆరోపిస్తూ ఆయన మనవడు త్యాగరాజన్ (64) చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, దుల్కర్ సల్మాన్, చిత్ర నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన 'కాంత' చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. తమిళనాడు ప్రభుత్వ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ అయిన పిటిషనర్ త్యాగరాజన్ తన పిటిషన్‌లో పలు కీలక అంశాలను లేవనెత్తారు. ప్రముఖుల జీవిత కథలను సినిమాగా తీయాలంటే వారి చట్టపరమైన వారసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సినిమాలో పాత్రల పేర్లు మార్చినప్పటికీ, ప్రజలు సులభంగా ఇది ఎవరి కథో గుర్తుపట్టగలరని ఆయన పేర్కొన్నారు.సినిమాలో తన తాత ఎం.కె. త్యాగరాజ భాగవతార్ అనైతిక జీవితం గడిపినట్లు, కంటి చూపు కోల్పోయి, చివరి రోజుల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి మరణించినట్లు చిత్రీకరించారని త్యాగరాజన్ ఆరోపించారు. "మా తాతకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆయనకు సొంత బంగ్లా, ఖరీదైన కార్లు ఉండేవి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చూపించడం సరికాదు" అని ఆయన కోర్టుకు విన్నవించారు.ఈ పిటిషన్‌ను స్వీకరించిన చెన్నై సివిల్ కోర్టు, నవంబర్ 18లోగా దీనిపై వివరణ ఇవ్వాలని దుల్కర్ సల్మాన్, రానాకు చెందిన నిర్మాణ సంస్థతో పాటు ఇతర ప్రతివాదులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
Latest News