by Suryaa Desk | Wed, Nov 20, 2024, 12:37 PM
గచ్చిబౌలి లోని సిద్ధిఖీ నగర్‌లో ఒరిగిన నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. హైడ్రాలిక్ యంత్రాలతో కూల్చేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే యంత్రాలను అక్కడికి తీసుకొచ్చారు. ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధిఖీనగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒకపక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది. మూడు రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవనం నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాని ప్రభావంతో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. ఈ క్రమంలో మూడో అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. రెండేళ్ల క్రితం ఇల్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందులోని అందరం ఖాళీ చేశామని తెలిపారు. ''భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది కాబట్టి తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ.. పక్క భవనం యజమానితో నష్టపరిహారం ఇప్పించండి. ఊరిలో పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టాం. ఇది కోల్పోతే మా పిల్లల భవిష్యత్తేంటి?భవనం కూల్చివేతతో నాతోపాటు పిల్లలు రోడ్డున పడతారు'' అని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.