by Suryaa Desk | Wed, Nov 27, 2024, 07:06 PM
ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ అక్కడి స్థానికులు గత 130 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. మంగళవారం (నవంబర్ 26న) రోజున రాత్రి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవటంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. మరో లగచర్ల ఘటనను తలపించేలా దిలావర్ పూర్ ప్రజలు ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. పోలీసులపై దాడులు, ఆర్డీవోను కారులో గంటల తరబడి నిర్బంధించి.. ఆమె కారును దహనం చేసే ప్రయత్నం చేయగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన.. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలోనే.. ఇటీవలే జరిగిన లగచర్ల ఘటనతో పాటు ఈ పరిణమాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. కలెక్టర్‌ను రంగంలోకి దింపింది. దీంతో.. దిలావర్ పూర్ ప్రజలతో కలెక్టర్ చర్చలు జరిపారు. ప్రజలతో జరిపిన చర్చల అనంతరం.. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇదే వ్యవహారంపై ప్రభుత్వంతో చర్చించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దిలావర్‌పూర్ ప్రజలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావటంతో.. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది.
అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటుచేయ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీని.. వ్యతిరేఖిస్తూ దిలావర్ పూర్ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. సుమారు 130 రోజులుగా రకరకాల పద్దతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంగళవారం (నవంబర్ 26న) రోజున రాస్తారోకో నిర్వహించి.. రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గ్రామాల ప్రజలంతా కలిసి రహదారిపై మూకుమ్మడి ధర్నా నిర్వహించటంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో ఆందోళనకారుల వద్దకు వెళ్లి బుజ్జగించేందుకు ఆర్డీవో ప్రయత్నించగా.. ఆమె కారును మహిళలు అడ్డుకున్నార. ఆర్డీవోను దాదాపు 6 గంటల పాటు కారులోనే నిర్బంధించటంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనకారులను చెదరగొట్టి.. ఆర్డీవోను రెస్క్యూ చేశారు. అనంతరం.. ఆర్డీవో కారును ఎత్తిపడేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. నేరుగా కలెక్టరే రంగంలోకి దిగి.. సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు.