by Suryaa Desk | Tue, Nov 26, 2024, 07:51 PM
గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ దెబ్బతినడం వల్లే హైదరాబాద్ నగరంలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసినా రోడ్లు నీట మునుగుతున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో 61 శాతం చెరువులు కనుమరుగయ్యాయని, ఇక 39 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు.ఇప్పుడు వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరంలోని చెరువులు ఎన్ని? వాటి విస్తీర్ణం ఎంత? ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఎంత? అనే వాటిని నిర్ధారించే పనిని హైడ్రా చేపట్టిందన్నారు. పట్టణీకరణ వేగంగా జరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని, మెరుగైన జీవనాన్ని అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, చెరువుల పరిరక్షణ, ప్రజల అవసరాల కోసం కేటాయించిన పార్కులను, రహదారులు కబ్జాలకు గురికాకుండా కాపాడటమే హైడ్రా ముఖ్య ఉద్దేశమన్నారు.