by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:37 PM
స్కూల్ బస్సులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీవో అధికారులను ఆదేశించారు. 15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలన్నారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్, ఆర్సీ అన్నిటినీ చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా స్కూల్ టైమింగ్స్‌లో, విద్యార్థులు బస్సుల్లో ఉన్నప్పుడు తనిఖీలు చేయరాదని అధికారులకు సూచించారు.
స్కూల్స్, కాలేజీలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవహగాహన పార్క్ ఏర్పాటు చేయాలని.. కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో కూడా ఇది తప్పనిసరి ఉండేలా విద్యాశాఖతో మాట్లాడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం యునిసెఫ్ సహకారం తీసుకోవాలన్నారు. అదే విధంగా 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు గ్రీన్ టాక్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.
దేశ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీని విప్లవాత్మకంగా తీసుకొచ్చిందని పొన్నం వ్యాఖ్యనించారు. ప్రతి ఎలక్ట్రిక్ వాహనాల షో రూంల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేసేలా ఈవీ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకోవాలన్నారు. వాహన సారథి అమలు ఆలస్యం చేయవద్దని అధికారులకు సూచించారు. కొత్తగా వచ్చిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉపయోగించాలని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు.
రవాణా శాఖకి ప్రత్యేకంగా లోగో రాబోతుందని మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రజా విజయోత్సవాల్లో దానిని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలు రాబోతున్నాయని.. దాంతో పాటు డేటా ఎంట్రీ కోసం టాబ్‌లు ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు ,కార్యాలయాలకు అవసరమైన కొత్త భవనాలు ,మౌళిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ , టాయిలెట్స్, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.