by Suryaa Desk | Fri, Nov 22, 2024, 09:25 PM
ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. వాజేడు మండల కేంద్రంలో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశారు. వాజేడు పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, అతడి బంధువు ఉయికా అర్జున్‌ను గురువారం అర్ధరాత్రి అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం వారి మృతదేహాల వద్ద వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను వదిలి వెళ్లారు. రమేశ్‌ను గొడ్డలితో నరికిన సమయంలో అతడి భార్య గట్టిగా కేకలు వేయడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను ఏటూరు నాగారం ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో అతడు మృతిచెందారు.
రమేశ్, అర్జున్ ఇద్దరు తరచూ అడవిలోకి వెళ్తూ నక్సల్స్ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని అనుమానం పెంచుకున్నారు. గతంలో ఇద్దరికీ హెచ్చరికలు చేసిన మావోయిస్టు పార్టీ.. తీరు మార్చుకోకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం రాత్రి వారి నివాసాల్లోకి నక్సల్స్ చొరబడ్డారు. ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్నవారిపై గొడ్డలితో దాడిచేశారు. రమేశ్ భార్య వారి నుంచి గొడ్డలి లాక్కోవడానికి ప్రయత్నించారు. కొంతసేపు ఆమె వారితో పెనుగులాడారు. ఆమెను పక్కకు నెట్టేసి గొడ్డలి లాక్కుని నరికేశారు. ఆమె కేకలు చుట్టుపక్కల ఉన్నవారు రావవడంతో నక్సల్స్ పరారయ్యారు. మావోయిస్ట్‌ల హత్యల గురించి మాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా, ఈ ఘటనతో మరోసారి తెలంగాణ ఉలిక్కిపడింది. మావోయిస్ట్ కదలికలపై ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇటీవల గస్తీ కూడా పెంచారు. ఈ సమయంలో ఇద్దర్ని ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేయడం గమనార్హం. గతంలోనూ మావోయిస్ట్‌లు పలువురు నాయకులు, పౌరులను లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు జిల్లాల్లో తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మావోల ఉనికి కూడా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎంతో సురక్షితంగా భావించిన దండకారణ్యంలో వారికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. భారీ సంఖ్యలో మావోలు ఇటీవల హతమయ్యారు.