by Suryaa Desk | Fri, Nov 22, 2024, 09:22 PM
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువకుడు.. పుట్టినరోజునే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన నవంబర్ 13వ తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన విషాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన 23 ఏళ్ల ఆర్యన్ రెడ్డి.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. యూఎస్‌లో జార్జియా స్టేట్ అట్లాంటాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. కాగా.. నవంబర్ 13న ఆర్యన్ రెడ్డి పుట్టినరోజు కావటంతో.. తన గదిలో స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకున్నాడు. అయితే.. అదే సమయంలో తన దగ్గరున్న లైసెన్స్డ్ హాంటింగ్ గన్‌ను క్లీన్ చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయ్యి.. బుల్లెట్ ఆర్యన్ రెడ్డి ఛాతిలోకి దూసుకెళ్లింది.
తుపాకీ పేలిన సౌండ్ వినగానే.. వేరే గదిలో ఉన్న ఆర్యన్ ఫ్రెండ్స్ వెళ్లి చూడగా.. బుల్లెట్ట్ తగిలి విలవిల్లాడుతూ ఆర్యన్ రెడ్డి కనిపించాడు. వెంటనే ఆర్యన్ రెడ్డిని తన స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. ఆస్పత్రికి వెళ్లేలోపే ఆర్యన్ ప్రాణాలు వదిలినట్టుగా డాక్టర్లు తేల్చేశారు. కాగా.. ఈ విషయం తెలిసి ఆర్యన్ తల్లిదండ్రులు, కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
ఆర్యన్ కుటుంబానికి.. తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని పెద్దరావు పల్లి గ్రామం కాగా.. ప్రస్తుతం ఉప్పల్‌లో నివసిస్తున్నారు. కాగా.. ఆర్యన్ మృతదేహాన్ని శుక్రవారం (నవంబర్ 22న) రాత్రి వరకు స్వగ్రామానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆర్యన్ తండ్రి సుదర్శన్ రెడ్డి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను విదేశాలకు పంపిస్తున్న ఇతర తల్లిదండ్రులు ఇలాంటివాటి పట్ల జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు అక్కడ హంటింగ్ గన్ లైసెన్స్‌లు పొందొచ్చని తమకు తెలియదని సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏ తల్లితండ్రులకూ ఇలాంటి కడుపుకోత మిగలకూడదని.. సుదర్శన్ రెడ్డి గద్గదస్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులర్ అధికారులు పంచుకున్న డేటా ప్రకారం, 2023-24 విద్యా సంవత్సరానికి యూఎస్ విశ్వవిద్యాలయాలకు విద్యార్థులను పంపుతున్న అగ్ర దేశంగా భారతదేశం ఇప్పుడు చైనాను అధిగమించినట్టు తెలుస్తోంది. అందులోనూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే విద్యార్థులు ఎక్కువగా యూఎస్ వెల్తున్నట్టు చెప్తున్నారు. దాదాపు 56 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్తుండగా.. ఇందులో తెలంగాణ నుంచి 34 శాతం, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 శాతం మంది ఉన్నారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే మాట్లాడుతూ.. స్టూడెంట్ వీసా దరఖాస్తులు గణనీయంగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. 2024 వేసవి కాలంలో 47,000 స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిర్వహించారని, 2023లో 35,000కి పెరిగాయని ఆమె పేర్కొన్నారు. యూఎస్ కాన్సులేట్‌లోని పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్‌లారెన్, దాదాపు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులను అమెరికాకు పంపారని పేర్కొన్నారు.