by Suryaa Desk | Fri, Nov 22, 2024, 07:19 PM
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి డిసెంబర్ 07వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తికానుంది. ఈ నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు, ఇచ్చిన హామీల అమలు, ఏడాది ప్రజాపాలనపై తెలంగాణ సీఎంపై ఇంట్రెస్టింగ్ నోట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉద్యోగాల భర్తీలో రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఏంఓ పేర్కొంది. ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగిందని.. తొలి ఏడాదిలోనే యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించిందని పేర్కొంది.
ఉద్యోగాల భర్తీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రికార్డు నమోదు చేసిందని సీఎంఓ పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే అరలక్ష అంటే.. 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టు సీఎంఓ వెల్లడించింది. గడిచిన పది సంవత్సరాల్లో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిన నిరుద్యోగుల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం సరికొత్త మార్పు తీసుకొచ్చిందని తెలిపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఎస్సీ తరహాలో సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు. అప్పటివరకు పెండింగ్లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలిగించిందని సీఎంఓ పేర్కొంది.
పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయో పరిమితిని కూడా సడలించినట్టు గుర్తు చేసింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయిన వాటితో పాటు వాయిదా పడ్డ పరీక్షలు, పెండింగ్లో పెట్టిన పరీకా ఫలితాలన్నింటినీ విడుదల చేసిందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలను అందించినట్టు సీఎంఓ పేర్కొంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ను ప్రకటించినట్టు సీఎంఓ పేర్కొంది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. కొత్త ప్రభుత్వం కేవలం 10 నెలల వ్యవధిలోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించిందన్నారు. జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించిందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారని... వారిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరినట్టు వివరించింది.
రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించిందని సీఎంఓ పేర్కొంది. పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్-1 పరీక్షను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిందని గుర్తు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని.. గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించిందని.. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు సీఏంఓ తెలిపింది.
టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని పేర్కొంది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్-4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించిందని సీఏంఓ తెలిపింది. మొత్తం 8143 మంది ఎంపికైన అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుందని సీఎంఓ తెలిపింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ రేవంత్ రెడ్డి సర్కార్ అధిగమించిందని తెలిపింది. ఎంపికైన 16067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిందని రేవంత్ రెడ్డి పేర్కొంది.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 7094 మంది స్టాఫ్ నర్సుల నియామకాలు విజయవంతంగా పూర్తి చేసిందని.. వీరిలో 6956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్టుగా సీఏంఓ పేర్కొంది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నిషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొత్తం 5378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని సీఏంఓ నోట్లో పేర్కొంది.