by Suryaa Desk | Sat, Nov 23, 2024, 12:09 PM
జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని నెలలుపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత, మళ్లీ రాజకీయాల్లోకి మాస్ ఎంట్రీ ఇచ్చారు. అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు.సోషల్ మీడియా వేదికగా కవిత రాజకీయంగా స్పందిచడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరికొన్ని రోజుల్లో కవిత క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.రాజకీయ విమర్శలకు పదును
జైలు నుంచి వచ్చిన తర్వాత దాదాపు మూడు నెలల పాటు నిశ్శబ్దంగా ఉన్న కవిత, ఇటీవల అదానీ వివాదంపై ట్వీట్టర్ వేదికగాసంచలన వ్యాఖ్యలు చేశారు. ''అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా?'' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆమె ట్వీట్ ప్రజల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆమె ప్రజా క్షేత్రంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ నుంచే జనాల్లోకి..
కవిత డిసెంబర్ నాటికి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అప్పటివరకు సోషల్ మీడియా, మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో కేడర్‌తో సమావేశాలు నిర్వహించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.
జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్ కమిషన్ వినతి
ఈ నెల 26న జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్ కమిషన్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, సంబంధిత రిజర్వేషన్లు పెంచాలని ఆమె కమిషన్‌ను కోరనున్నట్లు సమాచారం.
కవిత రాకతో.. పార్టీ కేడర్‌కు కొత్త జోష్
ఈ నెల 22న జాగృతి ముఖ్య నేతలతో కవిత భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహాలు, ముందుకు తీసుకువెళ్లవలసిన అంశాలపై చర్చించనున్నారు. 29న నిర్వహించనున్న దీక్ష దివస్ కార్యక్రమంలో ఆమె ఏ జిల్లాలో పాల్గొనేది త్వరలో తేలనుంది. కవిత రాకతో పార్టీ కేడర్ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Dailyhunt