by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:59 PM
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఇటీవల భూసేకరణ పక్రియ దాడులకు దారి తీసిన విషయం తెలిసిందే. లగచర్లలో భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. అక్కడి స్థానిక ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్ బృందంపై దాడికి యత్నించారు. కుడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడగా.. కలెక్టర్ సహా ఇతర అధికారుల కార్లు ధ్వసం చేశారు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీలకు అప్పగించబోమని చెప్పారు. ఈ ఘటన తర్వాత పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
అయితే అక్కడ రేవంత్ అల్లుడికి చెందిన ఫార్మా కంపెనీ పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ కుట్రపూరితంగా రైతుల భూములు లాక్కుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), ఆర్ఎస్పీ, సీపీఐ (ఎంఎల్ – లిబరేషన్) తదితర పార్టీల నాయకుల ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌ను శనివారం (నవంబర్ 23) సచివాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని చెప్పారు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్లు చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను లెఫ్ట్ పార్టీల నేతల బృందానికి సమగ్రంగా వివరించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదన్న విషయాన్ని గుర్తుచేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని అన్నారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. భూ సేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.