by Suryaa Desk | Fri, Nov 22, 2024, 09:26 PM
శాసనసభ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. గతేడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్, విద్యుత్ పథకాలను రేవంత్ రెడ్డి సర్కారు పట్టాలెక్కించింది. ఇక, మహిళలకు మరో కీలక పథకం అమలు విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నెలకు రూ.2,500 మహలక్ష్మి పథకంపై కీలక ప్రకటన చేసింది.
అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. అలాగే, మంత్రుల సబ్- కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
గురువారం వికారాబాద్ జిల్లా ధారూరులో రూ.2.01 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన రైస్ మిల్లు, గోదాంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రం, వాటర్‌ప్లాంట్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదన్నారు. రూ.వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అని స్పీకర్ ధ్వజమెత్తారు. ఆ అప్పులకు కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు రూ.58 వేల కోట్లు మిత్తి చెల్లించిందని చెప్పారు.
అంతకు ముందు గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ పక్కన నెక్లెస్ రోడ్డులోని హెచ్‌ఎండీఏ మైదానంలో నాలుగు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకార వృత్తిని ముందుకు తీసుకెళ్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని 40 లక్షల మత్స్యకార కుటుంబాలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని స్పీకర్ వివరించారు.