by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:31 PM
కాంగ్రెస్ పార్టీ ఉచితాలు, అబద్దాల ప్రచారాన్ని మహరాష్ట్ర ప్రజలు తిరస్కరించి ఖచ్చితమైన గుణపాఠం చెప్పారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. మహరాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి-ఎన్డిఏ విజయదుందుభి మోగించిన సందర్భంగా ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్నెళ్ళ క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్-యుపిఏ మిత్రపక్షాల పట్ల దేశ ప్రజలు కొంత సానుభూతుని చూపారని, కానీ, అతికొద్ది సమయంలోనే కాంగ్రెస్ పార్టీ కుటిలనీతిని అర్థం చేసుకున్న ప్రజలు ఆ పార్టీని బొందపెట్టడం జరిగిందన్నారు.
మిత్రపక్షాలను ముంచిన కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావగా అభివర్ణించిన సురేష్ రెడ్డి ఆ పార్టిని నమ్ముకున్న మిత్రపక్షాలను సైతం ముంచుతున్నదని ఎద్దేవ చేశారు. కాంగ్రెసును నమ్ముకున్న పాపానికి రాజకీయ కురువృద్దుడు ఎన్సిపి నేత శరద్ పవార్, ఉద్ధవ్ శివసేన పార్టీ నిండా మునిగిందని తెలిపారు. కాంగ్రెసును నమ్ముకున్న ఏ పార్టీ మనుగడ సాధించిన ధాఖలాలు లేవన్నారు.
తెలంగాణాలో వ్యూహాత్మకంగా..
రానున్న రోజులన్నీ భారతీయ జనతా పార్టీవేనని స్పష్టం చేసిన సురేష్ రెడ్డి, తెలంగాణాలో అధికారంలో రావడం కోసం వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేద్రమోదీ పట్ల ప్రజల్లో సంపూర్ణమైన నమ్మకం ఏర్పడిందని, దానిని బాసటగా చేసుకొని తెలంగాణాలో కమలం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్దిని మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం..
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు, రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇచ్చిన హామీలను మరిచి, నిలదీసిన ప్రజలను బెదిరింపులకు గురిచేయడం, దాడులకు పాల్పడటం చేస్తున్నారని తెలిపారు. పెద్దపల్లిలో సైతం ప్రజాప్రతినిధులు అదే పంథాను కొనసాగించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిస్వార్థ సేవలను అందిస్తామని సురేష్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు వేల్పుల రాజన్న పటేల్,దేవిడి రజినీకర్ రెడ్డి తదితర్లులు పాల్గొన్నారు.