by Suryaa Desk | Sat, Nov 23, 2024, 05:03 PM
మహారాష్ట్రలో ఐదు గ్యారంటీల పేరిట కాంగ్రెస్(చేసిన మాటల గారడీని ప్రజలు నమ్మలేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతుభరోసా ఎగ్గొట్టడం, ఆసరా పింఛన్లు ఇవ్వకపోవడం, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టమైందని అన్నారు. హేమంత్ సోరేన్‌పై బీజేపీ పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయిందని చెప్పారు. విజయం సాధించిన హేమంత్ సోరేన్‌కు హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు.