by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:59 PM
ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డిది నోరు అయితే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని కేటీఆర్ విమర్శించారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్లో భూసేకరణ ఫార్మా విలేజ్ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి అని మండిపడ్డారు కేటీఆర్.
తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా..? ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా..? ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.