by Suryaa Desk | Sun, Nov 24, 2024, 07:13 PM
తెలంగాణ ఆవిర్భావం తర్వాత గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది. డిసెంబర్ 7, 2023న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 15 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్ సెక్రటేరియట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ నెల 30న మహబూబ్నగర్‌లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలన్నారు. ఆ వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించాలని సూచించారు. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలన్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. పరిసరాల్లో ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర మంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. డిసెంబర్ 9 న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని.. ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 1000 మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి.. లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.