by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:30 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇస్తానన్న రూ. 100 కోట్ల ఫండ్ తీసుకోవటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజులుగా అదానీ వ్యవహారంపై తీవ్ర చర్చ జరగుతోందని.. అదానీ నుంచి రూ. 100 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ. 100 కోట్లు ఇస్తానని లేఖ రాసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆ డబ్బులు తీసుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పారు. ఈ మేరకు అదానీ గ్రూప్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ పలు విషయాలను వెల్లడించారు.
'అదానీ వ్యవహారానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అదానీ నుంచి రూ. 100 కోట్లు నిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదానీ నుంచి డబ్బులు తీసుకున్న మీరు వారి తప్పులను ఏ విధంగా ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీని అడిగారు. చాలా సందర్భాల్లో దీనిపై వివరణ ఇచ్చాం. చట్టబద్దంగా, రాజ్యాంగబద్ధంగా టెండర్లు పిలిస్తే.. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని మా నేత రాహుల్ చెప్పారు. నిబంధనల మేరకు టెండర్లు నిర్వహిస్తాం. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చాలా మంది నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కార్పోరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ రూ.100 కోట్లు ఇస్తామని లేఖ ఇచ్చారు. అదానీ గ్రూప్ 100 కోట్లు మాకు అప్పనంగా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోలేదు. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బ తీయకూడదు. అదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు తీసుకోవటానికి మేం సిద్ధంగా లేం. ఇప్పటికే అదానీ గ్రూప్‌కు లేఖ రాశాం. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.' అని రేవంత్ స్పష్టం చేశారు.
ఇక తన ఢిల్లీ పర్యటనపైనా విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. నేడు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఢిల్లీకి వెళ్తున్నాని చెప్పారు. నేటి పర్యటనలో ఎటువంటి రాజకీయ కోణం లేదని అన్నారు. మంగళవారం తమ పార్టీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గొంతెత్తేందుకు వారికి దిశానిర్ధేశం చేస్తామన్నారు. అంతే తప్ప.. తమ ఢిల్లీ పర్యటన మంతివర్గ విస్తరణకు సంబంధించినది కాదని అన్నారు. వివిధ శాఖల పనులు పెండింగ్‌లో ఉండటంతో కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. ఫెడరల్ దేశం కాబట్టి రాష్ట్రాలకు రావాలసిన నిధులు రాబట్టుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.