by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:50 PM
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు అరుదైన చేపలు చిక్కాయి. కృష్ణా ఉపనది అయిన దుందుభి నదిలో వేటకు వెళ్లిన ఓ జాలరికి రెండు అరుదైన చేపలు దొరికాయి. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి సమీపంలోని దుందుభి నదిలో చీమర్ల మణిందర్ అనే జాలరి చేపల వేటకు వెళ్లాడు. తోటి మత్స్యకారులతో కలిసి నదిలో వల విసరగా.. అతడి వలకు రెండు అరుదైన చేపలు చిక్కాయి. వాటిలో ఒకటి పాము ఆకారంలో ఉండగా.. మరొకటి శరీరంపై మచ్చలు, మచ్చలుగా కనిపించింది. పాము ఆకారంలో ఉన్న మలగమేను కాగా.. మరొకటి చెన్నై మెరీనా బీచ్‌లో కనిపించే డెవిల్ ఫిష్‌గా గుర్తించారు.
ఇందులో మలగమేను చేప అరుదుగా లభిస్తుందని తోటి జాలరులు చెబుతున్నారు. దీని విలువ చాలా ఎక్కవగా ఉంటుందని అంటున్నారు. అరుదైన ఈ చేపను ఔషదాల తయారీలో ఉపయోగిస్తారని అంటున్నారు. మలగమేను చేప 2.25 కేజీలు ఉన్నట్లు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో గత నాలుగేళ్ల క్రితం మలుగమేను చేప లభించినట్లు మత్స్యకారులు వెల్లడించారు. చాలా అరుదుగా మాత్రమే ఈ చేపలు వలలకు చిక్కుతాయని అంటున్నారు. దీని విలువ దృష్ట్యా మత్స్యకారుడి పంట పండిందని చర్చించుకుంటున్నారు. అరుదైన రెండు రకాల చేపలు ఒకేసారి దొరకడంతో వాటిని స్థానికులు చాలా ఆసక్తిగా తిలకించారు.
డెవిల్ ఫిష్ చాలా డేంజర్..
కాగా.. డెవిల్ ఫిష్ చాలా డేంజర్ అని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ నదులు, సముద్రాలకే పరిమితం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ డెవిల్‌ఫిష్‌ను 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద గుర్తించారు. భూమ్మీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 65 శాతం నీటివనరులకు విస్తరించిందని మత్స్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డెవిల్ ఫిష్ చేపలు చెరువుల్లోని మేతతో పాటుగా..చేపలను కూడా తినేస్తాయి. సున్నితమైన జల జీవావరణ వ్యవస్థనూ ఈ చేపలు దెబ్బతీస్తాయి.
విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఆక్సిజను లేని పరిస్థితిని కూడా తట్టుకొని జీవిస్తాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేస్తాయని అంటున్నారు. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన తెలుగు రాష్ట్రాల చెరువుల్లో ఈ డెవిల్ ఫిష్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.