by Suryaa Desk | Sat, Nov 23, 2024, 03:59 PM
నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హాయంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనబడుతున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. దాన్యం సేకరణలో గతంలో అస్తవ్యస్త విధానాల వల్ల 50 వేల కోట్ల రూపాయల బాకీ పడగా, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వానాకాలం ధాన్యం సేకరణలో ఎంతో పురోగతి ఉందని అన్నారు .దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు తీర్చేందుకు సమస్యలను జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు .రాష్ట్రంలో ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాలలో సన్నధాన్యాన్ని పండించడం జరిగిందని, ధాన్యంతో పాటు, సమగ్ర కుటుంబ సర్వే తదితర అంశాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దేశవ్యాప్తంగా 780 జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు .అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు అభిప్రాయాన్ని తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సమస్యల పై మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను సరైన విధంగా వినియోగించుకునేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ద్వారా సాధ్యమైనన్ని కేంద్ర నిధులను జిల్లాకు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 92 ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా జిల్లా ప్రజలు పొందే లబ్ది తక్కువగా ఉందని, అయితే ఈ కమిటి ద్వారా పూర్తిస్థాయిలో నిధుల వినియోగానికి కృషి చేసేందుకు జిల్లాలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ద్వారా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి నిధులు తీసుకొస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో అమలు చేసి గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు.వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా ఆయిల్ పామ్ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మిర్యాలగూడ,నాగార్జున సాగర్,తుంగతుర్తి,నకిరేకల్,దేవరకొండ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ,కుందూరు జైవీర్ రెడ్డి, బాలు నాయక్,మందుల సామేల్, మాట్లాడుతూ ధాన్యం అమ్మకంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, మిల్లర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ , అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ,జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.