by Suryaa Desk | Fri, Nov 22, 2024, 11:04 PM
హైదరాబాద్‌లో చెరువు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. అక్రమ నిర్మాణలపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తూ హడలెత్తిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్‌లలో నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరుగెత్తిస్తోంది. అయితే.. ఇన్ని రోజులూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన కట్టడాలపై కొరడా ఝళిపించిన హైడ్రా.. ఆ తర్వాత కొంతకాలంగా నివాసముంటున్న ఇండ్లను కూల్చోబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు.
ఇండ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ అనుమతులు ఉంటే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో 'హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్' పేరుతో రంగనాథ్ సమావేశం నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధిని ఎలా నిర్దారణ చేయాలి, చెరువుల సమస్యలు ఎలా పరిష్కరించాలి అన్న ప్రధాన అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించామని తెలిపారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, నాలాలను ఎలా పునరుద్ధరించాలనే అంశాలపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నామని రంగానాథ్ వివరించారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు. చెరువులను కాపాడుకోవడానికి ప్రజలను భాగస్వామ్యం చేయించేలా ప్రణాళికలు రచిస్తామన్నారు. చెరువులు పునరుద్ధరించాలంటే.. ఇళ్లను కూల్చివేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక నుంచి ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త నిర్మాణాలు అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణ బాగుందని తెలిపిన రంగనాథ్.. అధికారులతో కలిసి అక్కడ పర్యటించి ఆ విధానంపై అధ్యయనం చేసినట్టు వివరించారు. చెరువుల పునరుద్దరణకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని రంగనాథ్ స్పష్టం చేశారు. సర్వే ఆఫ్ ఇండియా, అలుగు హైట్, విలేజ్ మ్యాప్, లేక్ స్ప్రెడ్ డేటాలను పరిగణనలోకి తీసుకుని చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించనున్నట్టు రంగనాథ్ పేర్కొన్నారు.
చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్ ( పరిధిలో ఇళ్లను నిర్మిస్తే మాత్రం.. వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఆక్రమణల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వాడుతున్నామని పేర్కొన్న రంగనాథ్.. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే తమకు అలర్ట్ వస్తుందని పేర్కొన్నారు. అమీన్‌పూర్ చెరువు తూములు మూయడంతోనే లేఅవుట్లు మునిగాయని.. తప్పుడు అనుమతులు ఇచ్చిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని, ప్రజల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వస్తుందని రంగనాథ్ చెప్పుకొచ్చారు.
బతుకమ్మకుంటలో ప్రస్తుతం మిగిలిన భూమిలోనే చెరువును అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొందరు న్యాయస్థానానికి వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారని పేర్కొన్న రంగనాథ్.. తాము కోర్టులో కౌంటర్ వేసి, కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తోనే వెకేట్ చేయించి త్వరలోనే పునరుద్ధరిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.