by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:05 PM
ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య ప్రేమలు, బంధాలతో పాటు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలు కనుమరుగవుతున్న రోజుల్లో.. ఓ జంట మాత్రం తాము పెంచుకుంటున్న కుక్కపిల్లలపై కూడా చూపిస్తున్న ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు. వాళ్లు పెంచుకున్న కుక్కకు పిల్లలు పుట్టగా.. ఆ కుక్కపిల్లలకు సంప్రదాయబద్దంగా బారసాల నిర్వహించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం బారసాల నిర్వహించటమే కాదు.. వచ్చిన గెస్టులకు నోరూరిపోయే విందు భోజనం కూడా పెట్టి.. కడుపునింపారు. ఈ ఇంట్రెస్టింగ్ సీన్.. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది.
మెట్‌పల్లిలోని సుభాష్ నగర్‌లో నివాసముంటున్న రాపెల్లి వినోద్, లావణ్య దంపతులు ఓ సంవత్సరం నుంచి షీజూ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానికి డైసీ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా ఇంట్లో ఓ సభ్యురాలిగా పెంచుకుంటున్నారు. వాళ్ల పిల్లలతో పాటుగా డైసీని కూడా అంతే ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అయితే.. ఈ డైసీ ఇటీవలే నాలుగు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది.
దీంతో.. డైసీని కూడా తమ ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలిగానే చూసుకుంటున్న వినోద్, లావణ్య దంపతులు.. ఆ కుక్కపిల్లలకు కూడా మనుషుల లాగానే బారసాల నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఏదో ఇంట్లో చిన్న ఉయ్యాల పెట్టేసి.. తూతూమంత్రంగా కానిచ్చారనుకుంటే పొరపాటే. ఈ కుక్కపిల్లల బారసాలకు చుట్టాలను, ఇరుగు పొరుగు వారిని, దోస్తులను ఆహ్వానించారు. కుక్కపిల్లలకు కొత్త బట్టలు తొడిగి.. బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కుక్కపిల్లల నామకరణోత్సవానికి విచ్చేసిన గెస్టులందరికీ.. నోరూరించే విందు భోజనం ఏర్పాటు చేశారు. కల్లు గూడాలే కాదు.. చికెన్, బీర్లు కూడా మెనూలో ఉన్నాయి.
ఈ బారసాల కార్యక్రమంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆ కుక్కపిల్లలను కూడా తమ కుటుంబంలో భాగస్వామ్యులుగా చూస్తున్నారు కాబట్టే ఇలా బారసాల నిర్వహించిన వాటిపై తమకున్న ప్రేమను ఆ దంపతులు చాటుకున్నారని కొందరు అభిప్రాయపడుతుండగా.. మరికొంత మంది మాత్రం వార్తల్లో నిలిచేందుకే ఇలాంటి వింత వింత కార్యక్రమాలు చేస్తుంటారని విమర్శిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతూ.. ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బర్త్ డేలకు, మ్యారేజ్ డేలకే కాదు.. ప్రతీ చిన్న సందర్భాన్ని జనాలు ఓవర్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పక్కింటివాళ్లతో మాట్లాడలేరు.. కష్టంలో ఉన్నవాడికి సాయం చేసేంత దయాగుణం ఉండదు.. చుట్టాల ఇళ్లలో జరిగి కార్యక్రమాలకు హాజరయ్యే టైం ఉండదు కానీ.. ఇలా కుక్కలకు, పిల్లుల కోసం మాత్రం మనుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ విపరీత చేష్టలకు పాల్పడుతుంటారంటూ మరికొందరు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు.