by Suryaa Desk | Sun, Nov 24, 2024, 06:36 PM
తెలంగాణలో త్వరలో కొత్త రైళ్లు కూత పెట్టనున్నాయంటూ బీజేపీ పార్టీ తెలిపింది. ఈ మేరకు.. ఆదివారం (నవంబర్ 24న) రోజున ట్విట్టర్ వేదికగా.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది తెలంగాణ బీజేపీ. ప్రగతి పట్టాలపై తెలంగాణ రైలు.. మోదీ సారథ్యంలో కొత్తపుంతలు.. అంటూ చేసిన ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల కొత్త రైల్వేస్టేషన్లు, కొత్త రైల్వే మార్గాలతో పాటు విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు, రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే.. తెలంగాణలో 2024 -25 గాను రూ.5,071 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త లైన్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు చేపట్టినట్టు బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్‌తో పోల్చితే ఎన్డీఏ హయాంలో మెరుగైన అవకాశాలు కల్పించిందని.. పదేళ్లలో బడ్జెట్ కేటాయింపులు కూడా 20 శాతం పెరిగినట్టుగా వెల్లడించింది. కొత్త స్టేషన్ల నిర్మాణంలో, కొత్త రైళ్లు తెలంగాణకు రావడంలో కేంద్రం కృషి చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో తెలంగాణ రైల్వే రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని బీజేపీ చెప్పుకొచ్చింది.
ఎన్డీఏ హయాంలో ఏడాదికి సగటున 35 కిలోమీటర్ల కొత్త లైన్ల నిర్మాణం, 6 స్టేషన్లకు కొత్త భవనాలు, అధునాతనంగా 27 స్టేషన్లతో పాటు.. 73 కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది. ఇదే సమయంలో.. 2009 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో.. ఏడాదికి సగటున 15 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టిందని.. ఇక కొత్త స్టేషన్ల నిర్మాణం శూన్యమని.. అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త రైళ్ల సంఖ్య కూడా శూన్యమంటూ బీజేపీ గుర్తుచేసింది. ఇదే క్రమంలోనే.. 2014-15 సంవత్సరానికి గానూ.. తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం కేవలం రూ.258 కోట్ల బడ్జెచ్ మాత్రమే కేటాయించినట్టు బీజేపీ పేర్కొంది.
అయితే.. ప్రస్తుతమున్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు, విద్యుద్దీకరణ, వైఫై సౌకర్యం, సీసీ కెమెరాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫ్లాట్ ఫామ్‌ల విస్తరణ లాంటి పనుల్లోనూ యూపీఏ కంటే చాలా మెరుగైన వసతులు కల్పిస్తోందని బీజేపీ తన పోస్టులో పేర్కొంది.