by Suryaa Desk | Sun, Nov 24, 2024, 07:10 PM
హైదరాబాద్ శివారు ఆదిభట్ల పీఎస్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. తమ వద్ద ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయని.. అమ్మాయితో వరుసగా ఫోన్లు చేయించిన ఆగంతకులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం బెదిరించారు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పటంతో అతడితో కాగితాలపై వేలి ముద్రలు తీసుకొని విడిచిపెట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆదిభట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం బోయవాడకు చెందిన రాచ నారాయణ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నారాయణకు గత పదిరోజులుగా ఓ అమ్మాయి గొంతుతో ఫోన్లు వచ్చాయి. తాము కార్ ఇన్సూరెన్స్ చేస్తామని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తామని నమ్మించారు. కొంగరకలాన్ వద్ద తమకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని ప్రస్తుతం మార్కెట్ డౌన్ ఉన్నందున తక్కువ ధరకే ప్లాట్స్ వస్తాయని.. ఓసారి వచ్చి సైట్ విజిట్ చేయాలని కోరారు. వారి మాటలు నారాయణ నమ్మగా.. ఈనెల 21న మధ్యాహ్నం మెట్రో సిటీ వద్దకు రావాలని చెప్పారు. దీంతో నారాయణ తన డ్రైవర్ ముసిఫ్ ఖాన్‌తో కలిసి వారు చెప్పిన స్థలానికి వెళ్లి ఫోన్ చేశాడు.
ఇలా కాల్ చేసిన వెంటనే ఓ నలుగురు వ్యక్తులు కారులో అక్కడకు వచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా నారాయణ, ముసిఫ్‌ఖాన్‌లను చుట్టుముట్టి తుపాకీతో బెదిరించారు. అనంతరం వారి కార్‌లో కూర్చోబెట్టుకొని సెల్‌ఫోన్లు లాక్కున్నారు. అనంతరం నగర శివారులోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి గదిలో బంధించారు. రూ.కోటి డబ్బులు ఇవ్వాలని అప్పుడే వదిలేస్తామని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే తన వద్ద ప్రస్తుతం నగదు లేదని నారాయణ చెప్పాడు. దీంతో వారి వద్ద నుంచి తెల్ల కాగితాలపై వేలి ముద్రలు తీసుకున్నారు. అనంతరం కొంగరకలాన్‌లోని ఓ నిర్మానుష్యంగా ఉన్న ఓపెన్ ప్లాట్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వాళ్లిద్దరిని వదిలేసి కారులో పారిపోయారు.
భయంతో వణికిపోయిన నారాయణ వెంటనే ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలు, కారు నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆదిభట్ల సీఐ రాఘవేందర్ వెల్లడించారు.