by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:23 PM
సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విరాన్ జైన్ అనే విద్యార్థి టివోలి థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే సోమవారం స్కూలు వచ్చిన విరాన్ జైన్.. లంచ్ కోసం చపాతీ రోల్ వెంట తెచ్చుకున్నాడు. అయితే మధ్యాహ్న భోజనం సమయంలో చపాతి రోల్ తింటుండగా.. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక విరాన్ జైన్ ఇబ్బంది పడ్డాడు. పక్కనున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే దగ్గర్లోకి ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే విద్యార్థి చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు చికెన్ ముక్క చిక్కుకుపోయి.. ఇడ్లీ గొంతులో ఇరుక్కుని వ్యక్తులు చనిపోయిన ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ నెలాఖర్లో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దోసె గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి కూడా తెలిసిందే. వెంకటయ్య అనే వ్యక్తి మద్యం సేవించిన అనంతరం దోసె తిటుండగా.. అకస్మాత్తుగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఇబ్బందులు పడిన వెంకటయ్య.. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వెంకటయ్య చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే చికెన్, మటన్ ముక్కలు గొంతులో చిక్కుకుపోవటం సహజం. కానీ మెత్తగా ఉండే దోసె, ఇడ్లీ, చపాతీలు కూడా ఇరుక్కుపోయి వ్యక్తులు చనిపోవటం చర్చనీయాంశమైంది.
మరోవైపు ఏ ఆహారమైనా సరే తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. గొంతులో ఇరుక్కుంటే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించడం.. లేదా తింటూ మాట్లాడటం కారణంగా ఆహారం ఇరుక్కునే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా ఆహారాన్ని మింగేటప్పుడు శ్వాసనాళం మూసుకుపోతుందని.. కానీ వేగంగా తినేందుకు ప్రయత్నించడం లేదా తింటూ మాట్లాడేటప్పుడు శ్వాసనాళం మూసుకునే అవకాశం ఉండదని చెప్తున్నారు. దీంతో ఆహారం శ్వాసనాళంలో చిక్కుకుపోయి..ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది వస్తుందన్నారు. ఊపిరి ఆడకపోతే శరీరంలో ఆక్సిజన్ కొరత తలెత్తుతుందని.. మరీ ఎక్కువసేపు ఊపిరి ఆడకపోతే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.