by Suryaa Desk | Sat, Nov 23, 2024, 11:04 PM
గత కొంతకాలంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని.. అందులోనూ హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి దిగజారిపోయిందంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ.. దేశం మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో కూడా గడ్డు పరిస్థితులు వచ్చాయంటూ కామెంట్ చేశారు. అయితే.. ఇదంతా మొన్నటి వరకు. కానీ.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో పుంజుకుంటుంది. గడిచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌లోని స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచింది. ఈ మేరకు.. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టు వెలువరించింది.
అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఏకంగా 20 శాతం పెరిగాయని నైట్ ప్రాంక్ ఇండియా తన రిపోర్టులో పేర్కొంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించినట్టు రిపోర్టులో తెలిపింది. అక్టోబర్ నెలలో మొత్తం 5,985 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయించగా.. రూ.3,617 కోట్లు విలువ చేసే ఇండ్ల అమ్మకాలు జరిగినట్టు సర్వే పేర్కొంది. హైదరాబాద్ నగరంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ లావాదేవీల్లో ఏడాదికి 14 శాతం పెరుగుదల నమోదవుతున్నట్టు నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది.
అయితే.. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు కాస్త క్షీణించాయని.. కానీ అక్టోబర్ నెలలో మాత్రం బలమైన రికవరీ సాధించినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తన సర్వేలో తెలిపింది. ఆగస్టులో 27 శాతం, సెప్టెంబరులో 24 శాతం రియల్ ఎస్టేట్ విక్రయాలు క్షీణించగా.. అక్టోబర్‌లో మాత్రం 20 శాతం వృద్ధి సాధించినట్టు సర్వేలో తేలింది.
కాగా.. అక్టోబర్ నెలలో అత్యధికంగా.. రంగారెడ్డి ప్రాంతంలో 43 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్లు జరగ్గా.. మేడ్చల్ మల్కాజిగిరిలో 41 శాతం, హైదరాబాద్‌లో 16 శాతం రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇండ్ల విక్రయాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. 59 శాతం ఇండ్లు రూ.50 లక్షల కంటే తక్కువ ధరకు విక్రయించినట్టు సర్వేలో తేలింది. అలాగే ప్రీమియం ఇళ్ల కొనుగోలుపై వినియోగదారుల ఆసక్తి చూపిస్తున్నట్టుగా రిపోర్టులో పేర్కొంది.
రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరిగినట్టుగా సర్వేలో తేలింది. మరోవైపు.. 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న నివాస గృహాలకు డిమాండ్ పెరిగిందని నివేదికలో తెలిపింది. ఇలాంటి ఇండ్ల రిజిస్ట్రేషన్లలో 12 శాతం వృద్ది కనిపించినట్టు పేర్కొంది.
హైదరాబాద్‌లో రెసిడెన్సియల్ ప్రాపర్టీల సగటు ధర కూడా అక్టోబర్‌లో 7 శాతం పెరిగినట్టు నైట్ ప్రాంక్ సంస్థ తెలిపింది. ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో 6439 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలిపగా.. వీటి విలువ రూ.4043 కోట్లుగా తెలిపింది. గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 17 శాతం పెరిగినట్టు రిపోర్టులో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. దీంతో.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు ఏమాత్రం తగ్గలేదని ఇప్పటికీ కొనసాగుతోందని.. తెలుస్తోంది.