by Suryaa Desk | Fri, Nov 22, 2024, 07:49 PM
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇద్దరు ఎనిమిదో తరగతి విద్యార్థినులు అదృశ్యమైన ఘటన సర్వత్రా ఆందోళనకరంగా మారింది. అయితే.. స్కూల్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలు.. ఏ రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవటంతో.. ఎటు వెళ్లారు.. ఏమైపోయారన్న సమాచారం లేక అందరూ టెన్షన్ పడ్డారు. అయితే.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే.. కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ, తులసి నగర్ ప్రాంతాల్లో ఉంటున్న ఇద్దరు బాలికలు.. వివేకానందనగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కాగా.. నవంబర్ 20వ తేదీన.. ఉదయం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు బాలికలు.. సాయంతి తిరిగి ఇంటికి రాలేదు.
ప్రతిరోజూ ఐదున్నర సమయంలో ఇంటికి వచ్చే తమ పిల్లలు.. ఎంతసేపటికీ రాకపోవటంతో.. తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. వెంటనే స్కూల్‌కు ఫోన్ చేసి తెలుసుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. దీంతో.. ఆ బాలికల స్నేహితుల ఇండ్లకు ఫోన్ చేసి కూడా ఆరా తీశారు. అక్కడికి కూడా రాలేదని చెప్పటంతో.. తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తెలిసిన అన్ని చోట్ల వెతికినా లాభం లేకపోవటంతో.. పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు బాలికల తల్లిదండ్రులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విద్యార్థులిద్దరూ రాకపోవటంతో అపహరించారేమోనని అనుమానించగా.. మొదట కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే.. ఆ బాలికల తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే.. ఆ ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి డైరెక్టుగా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని సూర్యలంచ బీచ్‌కు వెళ్లినట్టు పోలీసులకు తోటి విద్యార్థులు సమాచారం ఇచ్చారు.
దీంతో.. వెంటనే అక్కడి పోలీసులను కాంటాక్ట్ అయిన కూకట్ పల్లి పోలీసులు.. పూర్తి విషయాన్ని వివరించారు. దీంతో.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు.. ఆ విద్యార్థినులు బీచ్‌కు వెళ్లినట్టు గుర్తించారు. కాగా.. ఆ బాలికలిద్దరు సేఫ్‌గానే ఉన్నారని సమాచారం ఇవ్వటంతో.. ఇద్దరి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఏపీ పోలీసులు ఆ ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.