by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:03 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం 'హైడ్రా' అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువులు, కుంటల ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 300కు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మార్మోగింది. ఇక ఈ కూల్చివేతల్లో భాగంగా.. కొందరు పేదల ఇండ్లను సైతం కూల్చేయటంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలకు ఇండ్లను అంటగట్టగా.. వాటిని హైడ్రా కూల్చివేయటంపై విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదని అన్నారు. హైడ్రా చర్యలు తీసుకోవడంతోనే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగిందని చెప్పారు. ఇప్పటివరకు ఆక్రమణలు జరిగాయని.. ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడటమే హైడ్రా ఉద్దేశమన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులను పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదని చెప్పారు. హైదరాబాద్ బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో శుక్రవారం (నవంబర్ 22) ఏర్పాటు చేసిన 'ఎఫ్‌టీఎల్ పరిధుల నిర్ధారణ', 'పట్టణాల్లో చెరువులు, నాలాలకు పునరుజ్జీవం' మేధోమథన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజా ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇప్పటి వరకు తాము తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామన్నారు. పేదలవైనా, పెద్దలవైనా అనుమతులు లేకుంటే కూల్చివేశామని చెప్పారు. మనసు చంపుకొని కూల్చివేతలు చేపట్టామని.. ఈ క్రమంలో తాము మానవత్వ కోణంలో ఆలోచిస్తే సమాజానికి నష్టం జరుగుతుందని అన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చెరువుల అన్యాక్రాంతంపై ఇప్పటికే 4 వేలకుపైగా ఫిర్యాదులు అందాయని అన్నారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఆయా చెరువులను రక్షిస్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాల నియంత్రణకు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని అన్నారు. ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించాక ఏదైనా నిర్మాణం చేపడితే అలర్ట్ చేసే మేసెజ్ వస్తుందని రంగనాథ్ వివరించారు.