by Suryaa Desk | Sat, Nov 23, 2024, 08:04 PM
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. చాలా రోజుల తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 5 నెలల పాటు తీహార్ జైలులో ఉండి.. సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ మీద బయటకొచ్చిన కవిత.. మూడు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. నవంబర్ 21న గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన కవిత.. నిన్న(నవంబర్ 22న) జాగృతి సమావేశం ఏర్పాటు చేసి.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై పోరాటం గురించి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ క్రమంలోనే.. శనివారం (నవంబర్ 23న) రోజున హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి కవిత వచ్చారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి శైలజను, ఆమె కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం చాలా బాధాకరమని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టనట్టు ఉండటం సరికాదని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 10 రోజులకు ఒక విద్యార్థి ప్రాణం పోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ పాఠశాలను చూసినా ఏదో ఒక సంఘటన జరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు. మరణించిన 42 మంది పిల్లల కుటుంబ సభ్యులకు రూ రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కవిత డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం కారణంగా సగటున నెలకు ముగ్గురు చొప్పున ఇప్పటి వరకు 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు కవిత పేర్కొన్నారు. సగటున పది రోజులకు ఒక పసి ప్రాణాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పొట్టన పెట్టుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సంక్షేమ శాఖలు సీఎం దగ్గరే ఉండటం వల్ల సమయం వెచ్చించలేకపోతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడిన కవిత.. కనీసం 10 నిమిషాల సమయాన్ని కేటాయించి సమీక్ష చేస్తే పసి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుందన్నారు.
నారాయణపేట హాస్టల్లో కలుషిత ఆహారం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసిన తర్వాతి రోజే అలాంటిదే మరో ఘటన జరగడం ఆందోళనకరమని కవిత దుయ్యబట్టారు. మంచి భోజనం పెట్టాలంటూ పిల్లలు కూడా రోడ్లెక్కి ధర్నా చేస్తున్నా దుస్థితి వచ్చిందని కవిత మండిపడ్డారు.