by Suryaa Desk | Tue, Nov 26, 2024, 08:22 PM
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ర్యాంకులు సాధించి మీ తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని ఆత్మకూర్ మండల నోడల్ అధికారి రాజేందర్ అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పెద్దాపురం జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నందుకు ఉపాధ్యాయులను అభినందించారు.
అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నోడల్ అధికారి రాజేందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని పట్టుదలతో ఇష్టంగా చదివి ర్యాంకులు సాధించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలు పెంచి మీ ఉన్నతికి తోడ్పడుతున్నాడని కొనియాడారు. విద్యార్థులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్చుకోవాలని అప్పుడే అన్ని రంగాలలో రాణిస్తారు అన్నారు. కోఆర్డినేటర్ శ్యాం కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఉపాధ్యాయులను తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి అన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తే ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమము అనాధాశ్రమం లో వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కని పెంచిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది అన్నారు.