by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:56 PM
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు.స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సరే, మరి అదానీ అవినీతి మీద రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్నారని, ఆ సమయంలోనే మీరు దావోస్‌లో అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్న సంగతేమిటి? అని హరీశ్ రావు ప్రశ్నించారు.అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి? నిలదీశారు. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో అదానీ వస్తే, తాము మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ (తెలంగాణ కాంగ్రెస్) రెడ్ కార్పెట్ పరిచిందని విమర్శించారు.ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తుంటే... అదే అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని, ఇప్పుడు అదానీ అవినీతి బయటికి రాగానే మాట మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.