by Suryaa Desk | Tue, Nov 26, 2024, 06:35 PM
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్‌గా నియామకమైన బీఆర్ నాయుడు.. తెలంగాణ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవలే.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ నాయుడు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడిని హరీష్ రావు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందిస్తోన్న బీఆర్ నాయుడికి.. తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం దొరకటం అదృష్టమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. తిరుమల ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హరీష్ రావు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వస్తున్న క్రమంలో.. తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కాగా.. హరీష్ రావు విజ్ఞప్తికి బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. టీటీడీ బోర్డులో చర్చించి.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని హరీష్ రావుకు బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున... నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్‌లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు.
నవంబర్ 20వ తేదీన కేటీఆర్‌ను కలిసిన సందర్భంలోనూ.. బీఆర్ నాయుడు ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే విజ్ఞప్తిని ఉంచారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లో, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలున్నాయని.. వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని బీఆర్ నాయుడును కేటీఆర్ కోరారు.