by Suryaa Desk | Tue, Nov 26, 2024, 07:05 PM
హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రో కీలకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లాలనుకునేవారు సౌకర్యవతంగా, వేగంగా ఉండటంతో మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు సిద్ధమైంది. రెండో ఫేజ్‌లో ఆరు కారిడార్లలో మెట్రో విస్తరణకు సిద్ధం కాగా.. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ మెట్రో తప్ప మిగిలిన కారిడార్లకు డీపీఆర్ సిద్ధం చేశారు.
ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం, ఎంజీబీఎస్- జేబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. కొత్తగా నాగోల్ – శంషాబాద్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్‌చెరు, రాయదుర్గం – కోకాపేట్, ఎల్‌బీనగర్ – హయత్ నగర్ మార్గాల్లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపారు.
అయితే నగరానికి ఉత్తరం వైపున ఉన్న మేడ్చల్ ప్రాంతానికి మెట్రో విస్తరణ లేకపోవటం ఆ ప్రాంతవాసులను నిరాశకు గురి చేస్తోంది. ఆ ప్రాంతం నుంచి మెట్రో కావాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండటం..రోడ్డు విస్తరణ జాప్యం కావడంతో మెట్రో సాధన సమితి పేరుతో ఆ ప్రాంతీవాసులు పోరుబాట పట్టారు. మేడ్చల్ అత్యంత రద్దీ మార్గం కావడంతో మెట్రో విస్తరణ పూర్తయితే నగరంలో ఉత్తరం వైపు నుంచి తూర్పు వరకు ప్రయాణం మరింత సౌకర్యంగా మారుతుందని చెబుతున్నారు.
జేబీఎస్ నుంచి అల్వాల్ మీదుగా శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ వైపు హైదరాబాద్ మెట్రో మర్గాలు నిర్మించాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు డబల్ డెక్ ఫ్లైఓవర్ చేపట్టి అందులో మెట్రో చేర్చాలని కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే రద్దీ సమయాల్లో గంటకు 10 వేల మంది రాకపోకలు సాగించే ప్రాంతాల్లోనే మెట్రో సాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ అధ్యయనాలు ఉంటేనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెబుతున్నారు. భూసేకరణ పరంగా దాంతో పాటుగా అక్కడ కంటోన్మెంట్ భూములు ఎక్కువగా ఉండటంతో భూసేకరణ కష్టమని అంటున్నారు.