by Suryaa Desk | Tue, Nov 26, 2024, 07:03 PM
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో నగ్న పూజలు కలకలం రేపాయి. నగ్న పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని హాస్టల్ వంట మనిషి, మరో వ్యక్తి పదో తరగతి చదువుతున్న బాలికను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బయపడిపోయిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకొని తల్లిదండ్రులకు విషయం చెప్పింది.
బాలిక తల్లి చెప్పిన వివవరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మంథని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో హాస్టల్ వంట మనిషి బాలికను ట్రాప్ చేసింది. పది రోజుల క్రితం బాలికను తన పర్సనల్ రూంకు పిలిపించుకుంది. మీ పిన్ని వచ్చారని నమ్మించి బాలకను తన గదికి తీసుకెళ్లింది. అనంతరం గది తలుపులు మూసేసింది. తాను చెప్పినట్లు వింటే కనక వర్షం కురుస్తుందని.. మీ తల్లిదండ్రులు పేదరికం నుంచి బయటపడతారని మాయ మాటలు చెప్పింది.
ఇంతలోనే ఓ వ్యక్తికి ఫోన్ చేసి గదికి రప్పించింది. అక్కడకు వచ్చిన వ్యక్తి బాలికను చూసి తాను చెప్పినట్లు చేస్తే కావాల్సినంత డబ్బొస్తుందని చెప్పాడు. శరీరంపై నూలు పోగు లేకుండా నగ్న పూజలు చేస్తే.. అమ్మవారు కనికరించి కనకవర్షం కురుస్తుందని చెప్పాడు. బాలికతో మట్లాడుతూనే ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి.. ఆమెను చూపించాడు. తల నుంచి పాదాల వరకు బాలికను వీడియో కాల్‌లో చూపించాడు. ఆ తర్వాత కాల్ కట్ చేసి బాలికను ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు.
మరో రోజు పూజ ఉంటుందని.. ఆ రోజు పూజ పూర్తి కాగానే కనకవర్షం కురిసి మీ తల్లిదండ్రుల కష్టాలు తొలిగిపోతాయని చెప్పాడు. అనంతరం బాలికను అక్కడి నుంచి పంపించారు. వారు చెప్పిన మాటలకు బయపడిపోయిన బాలిక.. హాస్టల్ నుంచి తప్పించుకొని మంథనిలో తమకు తెలిసిన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ నాలుగు రోజులు తలదాచుకున్న తర్వాత.. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది.
బంధువులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. మంథని చేరుకొని హాస్టల్ వంట మనిషిని నిలదీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు వంట మనిషిని అదుపులోకి తీసుకున్నారు. నగ్న పూజలు చేస్తానన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకోవటంతో గంతలో ఇటువంటి జరిగాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.