by Suryaa Desk | Tue, Nov 26, 2024, 10:16 PM
తెలంగాణలోని రైతులు ఇక నుంచి తమ వ్యవసాయ భూముల్లో సాధారణ పంటలకు భిన్నంగా సోలార్ పంట పండించొచ్చు. అందుకు అనుగుణంగా అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. అన్నదాతలు సొంతంగా లేక ఏదైనా సహకార- స్వయం సహాయక సంఘం, కంపెనీల భాగస్వామ్యంతో తమ వ్యవసాయ పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు అధికారులు మార్గదర్శకాలు రెడీ చేస్తున్నారు. 'ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) కింద పొలం గట్లపై లేదా బీడుభూముల్లో ఈ కేంద్రాల ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ద్వారా రైతులకు అదనంగా ఆదాయం పొందొచ్చు. ఈ మేరకు కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ వివరాలు వెల్లడించింది.
ఈ పథకాన్ని తెలంగాణలో అమలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రైతుల పొలాల్లో 4 వేల సోలార్ ప్లాంట్లను వచ్చే మార్చిలోగా ఏర్పాటుచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు టీజీరెడ్కోను నోడల్ ఏజెన్సీగా సర్కార్ నియమించింది. ఈ పథకంలో అన్నదాతలను ఎంపిక చేయడానికి అర్హతలు, నిబంధనలతో మార్గదర్శకాలను టీజీ రెడ్కో, ఇంధనశాఖ ప్రస్తుతానికి జారీచేయలేదు. మార్గదర్శకాలు జారీ అయిన తర్వాత.. తెలంగాణ వ్యాప్తంగా లోడు తక్కువగా ఉన్న సబ్‌స్టేషన్ల జాబితాలను తెలంగాణ విద్యుత్ పంపిణీ డిస్కంలు జారీచేస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఈ సబ్‌స్టేషన్ల పరిధిలోని రైతుల పొలాల్లో మాత్రమే సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తుంది. ఆ ప్రాంతాల్లో ఆసక్తి గల రైతులు లేదా సంఘాల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ టీజీ రెడ్కో ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంటే అందులో 2 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా ఒక మెగావాట్ సోలార్ ప్లాంటు ఏర్పాటుకు రూ.5 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా.
పొల్లాల్లో ఏర్పాటుచేసే సౌర ప్లాంట్లలో ఉత్పత్తయ్యే కరెంటును యూనిట్‌కు రూ.3.13 ధర చెల్లించి డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి. ఒక మెగావాట్ సామర్థ్యం ఉన్న ప్లాంటు నుంచి ఏడాదికి ఖర్చులన్నీ పోనూ రూ.30 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా. ఈ లెక్కన రెండు మెగావాట్లకు రూ. 60 లక్షల ఆదాయం పొందొచ్చు. ఈ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.