by Suryaa Desk | Tue, Nov 26, 2024, 08:34 PM
డిసెంబర్ 4న నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరుగునున్న విజయోత్సవ సభకు అనువైన స్థలాన్ని పకడ్బందీగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన స్థలాలైన పెద్ద కల్వల లోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని, పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రజా విజయోత్సవం వేడుకలను డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం లో జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా డిసెంబర్ 4న పెద్దపెల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరుపుతుందని అన్నారు.
నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని, ఈ సభలో గ్రూప్ 4, ఇతర వివిధ పోటీ పరీక్షలకు కింద ఎంపికైన 9 వేల మది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పెద్ద కల్వలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు వెంటనే జరిగేలా చూడాలని, నాణ్యమైన ధాన్యాన్ని త్వరగా కాంటా వేసి కొనుగోలు చేయాలని, ధాన్యం డబ్బులు రైతులకు సకాలంలో చెల్లించేలా వివరాలను ఓపిఎంఎస్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలు జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసిల్దార్ రాజ్ కుమార్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.