by Suryaa Desk | Tue, Nov 26, 2024, 09:13 PM
తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ముందుండటం వల్లే 2014, 2018లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రమే ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ అధికారంలో ఉండి ఉండేవన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలిస్తామని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేటీఆర్ వయస్సు ఎంత? ఆయన శక్తి ఎంత? కాంగ్రెస్ మర్రిచెట్టు వేరు నుంచి వచ్చిన మొక్కే కేసీఆర్ అన్నారు. కేటీఆర్ తన వయస్సుకు మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యూహాల ముందు, కాంగ్రెస్ పార్టీ ముందు ఆయన వయస్సు, శక్తి ఎంత అన్నారు. కాంగ్రెస్ వయస్సు 140 సంవత్సరాలు అయితే కేటీఆర్ వయస్సు 53 కావొచ్చు అన్నారు.