by Suryaa Desk | Wed, Nov 27, 2024, 04:28 PM
కాంగ్రెస్ పాలన తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు భారాస అడుగుజాడల్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోందని భాజపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస సకల జనుల సర్వే అంటే.. కాంగ్రెస్ సమగ్ర కుల గణన అంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను జైలుకు పంపుతామన్నారని.. ఏమైందని ప్రశ్నించారు. అప్పులు తేవడంలో భారాస పంథాలోనే కాంగ్రెస్ సర్కారు పయనిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వ మూసీ ప్రణాళికనే.. ప్రస్తుత సర్కార్ అమలు చేస్తోందని చెప్పారు.''భారాస తరహాలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. రెండు పార్టీల నాటకాలను బట్టబయలు చేస్తాం. అక్రమ నిర్మాణం పేరుతో అయ్యప్ప సొసైటీ కట్టడాలను కేసీఆర్ (KCR) ప్రభుత్వం వేగంగా కూల్చేసింది. ఆ తర్వాత అన్నీ సక్రమం అయిపోయాయి. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చుతామంటున్నారు. రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎడమ కన్ను కేసీఆర్, కుడి కన్ను రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరించిన సీఎం.. కాళేశ్వరం కొట్టుకుపోవడానికి కారణమైన గుత్తేదారు విరాళాలు ఎందుకు తిరిగి ఇవ్వలేదు?. 6 మోసాలు.. 66 అబద్ధాలతో టైంపాస్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవడం, దాచుకోవడమా?. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏడాది పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా?'' అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు.