by Suryaa Desk | Wed, Nov 27, 2024, 07:42 PM
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయితే అధికారులు నిద్రపోతున్నారా? అని సీజే ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని ప్రభుత్వంపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అధికారుల నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాగా, హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. వారం రోజుల్లో ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేస్తామని కోరారు. ఈ అభ్యర్థనపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని ప్రశ్నించింది. ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేతకాదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది.
మాగనూరు జడ్పీ హైస్కూల్‌లో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కాకుండానే.. అదే స్కూల్‌లో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం (నవంబర్ 26) స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు చేసుకున్నారు. గమనించిన స్కూల్ టీచర్లు వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. మెుత్తం 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా.. వారిలో 7 విద్యార్థులు వెంటనే కోలుకున్నారు. మిగిలిన 22 మందిని మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మరోసారి కలకల రేపింది.
అయితే ఫుడ్ పాయిజినింగ్ స్కూల్‌లో భోజనం చేయటం వల్ల కాలేదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు. బేకరీలో తినుబండారాలు కొనుక్కొని తిన్నట్లు తమ విచారణ తెలిసిందన్నారు. వాటి వల్లే భోజనం అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనంతో ఎలాంటి ఇబ్బంది లేదని.. స్థానిక ఎమ్మార్వో సురేశ్ కుమార్, ఐదుగురు ఉపాధ్యాయులు భోజనం చేసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించినట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. తాజాగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల ప్రాణాలు పోతేకానీ స్పందించరా? అని నిలదీసింది.
ఇక గత నెల 29న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థిని పరిస్థితి విషమించి మృతి చెందింది. విద్యార్థిని శైలజ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు.