by Suryaa Desk | Wed, Nov 27, 2024, 07:39 PM
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎన్డీఏ సర్కార్ విజయం సాధించగా.. మిగతా రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా ఎగరేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు షురూ చేశారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో మార్గం సుగమం చేసుకోవాలని కమలనాథులు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగనే.. ఈరోజు (నవంబర్ 27న) తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమావేశానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పని చేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసినట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలని సూచించినట్టుగా చెప్పుకొచ్చారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సబ్ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏంటని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. బెదిరింపులు, తిట్లపురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప ఏమీ సాధించలేదంటూ దుమ్మెత్తిపోశారు. తాను ఏదైనా సమస్యపై మాట్లాడితే కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటని దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి.. తనది బీజేపీ డీఎన్ఏ అని, ఆయనలా 10 పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదంటూ కౌంటర్ ఇచ్చారు. మూసీపై ఆందోళన చేస్తే గుజరాత్ గులాం అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 5 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక సంఘటనలు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దాడులు చేసేందుకు పెట్టే సమయాన్ని.. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వా్న్ని గాడిన పెట్టడంపై వెచ్చిస్తే బాగుంటుందని హితవు పలికారు.
తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. వాళ్లే చీలిపోయి పడిపోతామంటే కట్టెలు పెట్టి ఆపాల్సిన అవసరం తమకు లేదంటూ చమత్కరించారు. తెలంగాణతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే ఆలోచన తమకు లేదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు హైకోర్టు చెప్పినా సరే.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి.. ఏడాది గడిచినా ఏమీ చేయలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మరోవైపు.. నవంబర్ నెలాఖరు వరకు అన్ని గ్రామ కమిటీలను పూర్తి చేస్తామని తెలిపిన కిషన్ రెడ్డి.. డిసెంబర్ మొదటి వారంలో మండల కమిటీలు, ఆ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అనంతరం జాతీయ అధ్యక్షుడిని నియమించనున్నట్టు వివరించారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా డిసైడ్ అయిందని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణకు కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని చెప్పుకొచ్చారు.