by Suryaa Desk | Wed, Nov 27, 2024, 08:27 PM
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలపై ఆయన ఆరా తీశారు.ఢిల్లీలో పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో బుధవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను.. ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించినట్లు సమాచారం. అందరి బాగోగులు అడిగినట్లు తెలిసింది. నాయకులంతా కలిసి మెలసి పని చేయాలని సూచించినట్లు టాక్. అలాగే తెలంగాణలో కష్టపడి పనిచేయాలని, బీజేపీ ప్రభుత్వం వచ్చేలా సమర్థవంతంగా పని చేయాలని మోడీ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు ఈ చర్చ కొనసాగినట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దానిపై సైతం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిచేసుకోనున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. కాగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంపై బీజేపీ కార్యాచరణ ఏంటనే అంశాలపై ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చేపట్టనున్న ప్రణాళికను ఎమ్మెల్యేలు, ఎంపీలు మోడీకి వివరించినట్లు తెలిసింది. కాగా జనాలకు అర్థమయ్యే తీరులో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే బీజేపీలో సంస్థాగత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఎవరిని స్టేట్ చీఫ్ గా చేస్తే బాగుటుందనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుటుందనే అంశంపై ఎమ్మెల్యేలు, ఎంపీల ఒపీనియన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వాటితో పాటు నియోజకవర్గాల్లో అభివృద్ధి అంశాలపైనా చర్చించినట్లు టాక్. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసినట్లు వినికిడి.
ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సునీల్ బన్సల్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్మేల్యు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం, వరుసగా సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో తెలంలగాణలో జరగబోయే ఎన్నికలపై బన్సల్ బన్సల్ సమావేశం నిర్వహించినట్లు వినికిడి. ఇదిలా ఉండగా ఉన్న పళంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లడంపై ప్రశ్నించగా కేవలం క్యాజువల్, కర్టసీ మీటింగ్ అని చెప్పడం గమనార్హం. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మినహా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ హస్తినకు వెళ్లారు. అనివార్య కారణాల వల్ల మహేశ్వర్ రెడ్డి హాజరవ్వలేదని సమాచారం.