by Suryaa Desk | Wed, Nov 27, 2024, 10:58 PM
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ట్రాఫిక్‌లో నరకం కనిపిస్తోంది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, స్ట్రీట్ వెండర్స్ రోడ్లను ఆక్రమిచటం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు గతంలో పోలీసులు ఆపరేషన్ రోప్(రోడ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్‌మెంట్) కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లు, పుట్‌పాత్ ఆక్రమణలపై ఈ కార్యక్రమం కింద ఉక్కుపాదం మోపారు. అయితే ఈ రోప్ కార్యక్రమంలో గత కొంత కాలంగా ఆగిపోగా.. తాజాగా మళ్లీ ప్రారంభించారు.
ట్రాఫిక్ సమస్యను గాడిన పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆగిపోయిన ఆపరేషన్ రోప్ ప్రారంభించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. షేక్‌పేట్ నుంచి టోలిచౌకి ఫ్లైఓవర్ వరకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించినట్లు చెప్పారు. 15 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లను బుల్డోజర్‌తో ధ్వంసం చేశామన్నారు. సర్పంచుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు వాహనాలకు సైరన్లు బిగించుకొని ఇష్టానుసారం మోగిస్తున్నారని సీపీ మండిపడ్డారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెడ్, బ్లూ రంగు బల్బులు, సైరన్లు వినియోగించటం నేరమని స్పష్టం చేశారు. అనవసరంగా హారన్ మోగించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే హారన్ సైరన్ మోగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు పాటించిన వారిపై కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుకుందని.. వాటికి సరిపడా రోడ్లు, ఫ్లై ఓవర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుట్‌పాత్‌లు చాలా వరకు ఆక్రమణలు గురయ్యాయి. ట్రాఫిక్ జాంలకు కారణమవుతున్న చిరు వ్యాపారాలు, తోపుడుబండ్లు తొలగిస్తే పేదలు ఎలా బతకాలంటూ తొలగింపును అడ్డుకుంటారన్నారు. మళ్లీ వారే నగర ట్రాఫిక్‌ను సరిదిద్దమని కోరుతుంటారని గుర్తుచేశారు.
కొన్ని దుకాణాల యజమానులు ఫుట్‌పాత్‌ల స్థలాన్ని చిరువ్యాపారులు, తోపుడుబండ్లకు అద్దెకిస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్టీఏతో పాటు అన్నింటికన్నా ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అవసరమన్నారు. వారు చొరవ తీసుకోకపోతే బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి మనకూ ఎదురవుతుందని సీపీ ఆనంద్ హెచ్చరించారు.