|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:54 PM
తెలుగులో రూపొందిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సిరీస్ లో వరుణ్ తేజ్ .. ప్రియాంక జైన్ .. ఉత్తేజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 19 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా పలకరించిన ఈ సిరీస్ కథేమిటనేది చూద్దాం.
కథ: డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) కంటి డాక్టర్. హైదరాబాదులో ఒక క్లినిక్ ను నడుపుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇతరుల జీవితాలలో ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనించడం .. తెలుసుకోవడం అతని హాబీ. తాను ఉంటున్న అపార్టుమెంటులోని రహస్యాలను కూడా వాచ్ మెన్ ద్వారా తెలుసుకుంటూ, అందుకు లంచంగా అతనికి ఎంతోకొంత ముట్టజెబుతూ ఉంటాడు. ఆ కుతూహలంతోనే అతను కొత్తరకం కళ్లద్దాలను తయారు చేస్తాడు. 'ఐ' చెకప్ కోసం తన క్లినిక్ కి వచ్చిన వారిపై తన ప్రయోగాన్ని అమలుపరుస్తూ ఉంటాడు. ఆ తరువాత నుంచి వాళ్లు 12 గంటల పాటు చూసే దృశ్యాలను .. ఓ నాలుగు నిమిషాల పాటు తన దగ్గరున్న కళ్లద్దాలలో నుంచి చూసే ఒక కొత్త పద్ధతిని కనుక్కుంటాడు. అలా వాళ్ల వ్యక్తిగత విషయాలను .. రహస్యాలను తెలుసుకుంటూ మానసిక పరమైన ఆనందాన్ని పొందుతుంటాడు. అయితే ఈ వ్యవహారమంతా తన క్లినిక్ లో పనిచేస్తున్న కవిత - బోస్ లకు కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ నేపథ్యంలోనే మాధవి ( ప్రియాంక జైన్) గౌరీ శంకర్ (ఉత్తేజ్) దంపతులు ఆ క్లినిక్ కి వస్తారు. గౌరీశంకర్ ఓ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికీ .. మాధవికి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. మాధవిని చూడగానే డాక్టర్ నయన్ మనసు పారేసుకుంటాడు. తాను కనిపెట్టిన కళ్లద్దాలతో, వాళ్ల జీవితాన్ని రహస్యంగా గమనించడం మొదలుపెడతాడు. మాధవి తన భర్తను హత్య చేయడాన్ని అతను ఆ కళ్లద్దాల ద్వారానే తెలుసుకుంటాడు. అందుకు కారణమేమిటో తెలుసుకోవడం కోసం అతను నేరుగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? అతను మాధవిని కాపాడతాడా? చట్టానికి అప్పగిస్తాడా? అసలు ఆమె తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కారణమేంటి? అనేది కథ.
Latest News