![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:31 AM
ఎల్ 2 ఎంపురాన్ వివాదంపై ఇప్పటికే నటుడు మోహన్ లాల్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరపున క్షమాపణలు తెలియజేస్తూ ఆయన ఒక పోస్టు కూడా పెట్టారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక కూడా ఈ వివాదంపై స్పందించారు.తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ వివాదంపై మొదట తాను స్పందించకూడదని నిర్ణయించుకున్నానని, కానీ తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు చూసి బాధతో పోస్ట్ పెడుతున్నట్లు తెలిపారు.ఎల్ 2 ఎంపురాన్ తెర వెనుక ఏమి జరిగిందో తనకు పూర్తిగా తెలుసునని, తన కుమారుడిని అన్యాయంగా నిందిస్తున్నారని, తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదన్నారు.మోహన్ లాల్ తనకు ఎన్నో రోజులుగా తెలుసునని, తనకు సోదరుడితో సమానమన్నారు. నా కుమారుడిని ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రశంసించారని చెప్పారు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు తన కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే ఇందులో భాగమైన అందరికీ బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు. వారంతా స్క్రిప్ట్ చదివారని, చిత్రీకరణ సమయంలో అందరూ ఉన్నారని, అందరి ఆమోదంతోనే సినిమా తెరకెక్కిందన్నారు. రచయిత కూడా ఎప్పుడూ పక్కనే ఉన్నారని, అవసరమైతే డైలాగుల్లో మార్పులు చేసే వారన్నారు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతారని ప్రశ్నించారు.మోహన్ లాల్‌కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన కూడా సినిమాను చూశారని పేర్కొన్నారు. తన కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదని, అలా ఎప్పటికీ చేయడని ఆమె పేర్కొన్నారు. సినిమా షూటింగ్ కోసం తన కుమారుడు ఎంతో కష్టపడ్డారని తెలిపారు.
Latest News