![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:37 AM
‘మ్యాడ్ స్క్వేర్ సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.. రివ్యూవర్ లు మాత్రం కంటెంట్ లేదని తీర్పులిస్తున్నారు. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్ లకు తెలియడంలేదా?’ అంటూ నిర్మాత నాగవంశీ ప్రశ్నించారు. నెగెటివ్ రివ్యూలను హైలైట్ చేస్తూ మీడియాలో చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు. సినిమాను చంపొద్దని, సినిమాలు ఆడితేనే అందరూ ఉంటారు లేదంటే ఇంటికి వెళ్లాల్సిందేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని సినీ జర్నలిస్టులకు హితవు పలికారు. ఈ మేరకు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా టికెట్ ధరలను తగ్గించిన విషయం వెల్లడించేందుకు నాగవంశీ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. సీక్వెల్ కాబట్టే మ్యాడ్ స్క్వేర్ ఆడుతోందనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. కంటెంట్ లేకున్నా చూడడానికి మ్యాడ్ స్క్వేర్ సినిమా ఏమీ ‘బాహుబలి’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ లాంటి పెద్ద సినిమా కాదని, ఈ సినిమాలో పెద్ద హీరోలు ఎవరూ లేరని గుర్తించాలన్నారు. రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బాగుంది కాబట్టే ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. ‘సినిమా ఇండస్ట్రీ, మీడియా కలిసి పనిచేయాలి.. నేను సినిమాలు తీస్తేనే మీ వెబ్ సైట్లు, ఛానళ్లు నడుస్తున్నాయి. మీ ఛానళ్లను మా సినిమాలే బతికిస్తున్నాయి. మేం ప్రకటనలు ఇస్తేనే మీ వెబ్ సైట్లు పనిచేస్తాయి. సినిమా ఆడుతున్నప్పుడు ‘‘కంటెంట్ లేని సినిమా ఎలా ఆడుతుందో తెలియదు”అంటూ తీర్పులివ్వకండి. సినిమా ఆడితేనే మీరుంటారు. లేకుంటే మీరు ఇంటికి వెళ్లాల్సిందే. సినిమాను చంపకండి. అది గుర్తుపెట్టుకోండి’ అంటూ నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News