|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 06:59 PM
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు, వాటి బ్రాంచ్‌లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా ఎన్నో టెక్ కంపెనీలు.. హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలోనే మొట్టమొదటి యాపిల్ రిటైల్ స్టోర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ తయారు చేసే ఈ యాపిల్ సంస్థకు సంబంధించిన రిటైల్ స్టోర్ ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. ఇక ఈ యాపిల్ రిటైల్ స్టోర్ కోసం అందులో పనిచేసేందుకు ఉద్యోగుల కోసం యాపిల్ సంస్థ త్వరలోనే రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించనంది.
హైదరాబాద్ రిటైర్ స్టోర్‌లో యాపిల్ స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ను యాపిల్ సంస్థ మొదలుపెట్టింది. 2027 మొదట్లో హైదరాబాద్ నగరంలో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది ముందు నుంచే అర్హత ఉన్న వారి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో ఇప్పటికే యాపిల్ రిటైల్ స్టోర్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో కూడా 2027 మార్చి నాటికి యాపిల్ రిటైల్ స్టోర్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ నగరంలోనూ టీ స్క్వేర్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఐటీ హబ్ అయిన రాయదుర్గంలో టీ స్క్వేర్ పేరుతో ఒక భారీ టవర్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మించనుంది. ఈ బిల్డింగ్ లోనే యాపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
ఇక ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అదే సమయంలో 24 గంటల పాటు టీ స్క్వేర్ పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అందులో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా తమ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసుకునేలా వారికి ప్రోత్సాహం కల్పించాలని పేర్కొన్నారు. ఇక టీ స్క్వేర్‌లో పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. యుటిలిటీ జోన్‌ను కూడా ఏర్పాటు చేయాలని వెల్లడించారు.
టీ స్క్వేర్ హైదరాబాద్‌కు రావడం వల్ల నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్యను భారీగా పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీ స్క్వేర్‌ను.. హైదరాబాద్ నగరంలోనే కీలక డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ ఆలోచిస్తోంది. టీ స్క్వేర్ వల్ల టూరిస్ట్‌లకు అద్భుతమైన అనుభూతి కలగడం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతుందని భావిస్తోంది. ఆ టీ స్క్వేర్‌లో ఏర్పాటు చేసే వీడియో బిల్ బోర్డులపై యాడ్స్.. పర్యాటకుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.