![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:56 PM
ప్రశంసలు పొందిన 'సంతోష్' చిత్రం ఆస్కార్ బరిలో నిలిచినా, స్వదేశంలో మాత్రం విడుదల అయ్యేందుకు కష్టాలు ఎదుర్కొంటోంది. యూకే తరపున ఆస్కార్ అవార్డుకు అధికారికంగా ఎంపికైన ఈ సినిమాను భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తుంటే, సెన్సార్ బోర్డు మాత్రం బ్రేక్ వేసింది.సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు ఉన్నందున విడుదల చేయడం సాధ్యం కాదని సెన్సార్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు చిత్రబృందానికి సమాచారం అందించామని, అయితే వారు మార్పులకు అంగీకరించలేదని తెలిపింది. దీంతో సినిమా విడుదల నిలిచిపోయింది."భారతదేశంలో సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం చాలా ప్రయత్నించింది. మేము కొన్ని సూచనలు చేశాము, కానీ వారు వాటిని పాటించడానికి నిరాకరించారు. రివైజింగ్ కమిటీ కూడా కొన్ని మార్పులు సూచించినా ఫలితం లేకుండా పోయింది" అని సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపారు.సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక యువతి హత్య కేసును ఛేదించే క్రమంలో ఒక మహిళా పోలీస్ అధికారి ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. గత సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి.భారతదేశంలో జనవరి 10న విడుదల కావాల్సిన 'సంతోష్' సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఈ పరిణామం పట్ల చిత్రబృందం నిరాశ వ్యక్తం చేసింది. ఆస్కార్ బరిలో నిలిచిన తమ సినిమాను భారతీయ ప్రేక్షకులు చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Latest News