![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:45 AM
ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలు చిన్న సినిమాల కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాయి. ఒక మంచి కథను పట్టుకుని .. ఒక మంచి పల్లెటూరిని లొకేషన్ గా మార్చుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించడానికి అవసరమైన వనరులుగా ఇప్పుడు పల్లెటూళ్లు కనిపిస్తున్నాయి. అలా రూపొందిన 'మధుశాల' .. నిన్నటి నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: అది ఒక మారుమూల గ్రామం .. ఎమ్మెల్యే సత్యనారాయణ (గోపరాజు రమణ) అధికారం అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా వెంకట్రావ్ (బెనర్జీ) కూడా అదే ఊళ్లో ఉంటాడు. సత్యనారాయణ తన కొడుకు ప్రేమించాడని చెప్పి .. పేదింటి అమ్మాయి పల్లవి (యానీ)ని కోడలిగా తీసుకుని వస్తాడు. ఆయన ఆదర్శాన్ని గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. పల్లవి తల్లిదండ్రులు తమ అదృష్టానికి మురిసిపోతారు. అదే గ్రామంలో దుర్గా ( మనోజ్ నందం) కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉంటాడు. రాములు (తనికెళ్ల భరణి) కూతురు 'కనక' (ఇనయా)ను అతను ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇక ఆ గ్రామానికే అందగత్తెగా అందరూ 'మధురవాణి' (వరలక్ష్మి శరత్ కుమార్) పేరు చెబుతూ ఉంటారు. ఎలాగైనా ఆమెను పొందాలనే ఉద్దేశంతో రవి 'గెటప్ శ్రీను) ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. ఈ నేపథ్యంలోనే పల్లవిని కిడ్నాప్ చేసి ఓ నాలుగు రాజుల పాటు రహస్యంగా ఉంచమని నాయుడమ్మ (రఘుబాబు) చెప్పడంతో 'దుర్గ' అలాగే చేస్తాడు. దాంతో పల్లవి కోసం వెతుకులాట మొదలవడంతో ఊళ్లో వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారిపోతుంది. ఆ సమయంలోనే పల్లవిని చంపేయమనే ఆదేశం దుర్గకి అందుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పల్లవిని చంపించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? మధురవాణి పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.
Latest News